ఏపీకి కొత్త ఎస్ఈసీగా మాజీ సీఎస్ నీలం సాహ్ని.. గవర్నర్ ఆమోదం..!

Saturday, March 27th, 2021, 01:18:40 AM IST


ఏపీకి నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని ప్రభుత్వం నియమించింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్‌కు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించారు. అయితే నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రభుత్వం ముందుగా ప్రతిపాదించగా చివరికి నీలం సాహ్నిని గవర్నర్ ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఆయన స్థానంలో నీలం సాహ్ని ఏప్రిల్ ఒకటో తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎస్‌గా కొద్దిరోజులు ఎల్వీ సుబ్రమణ్యం కొనసాగారు. అయితే ఆయనను తప్పించి సీఎం జగన్ నీలం సాహ్నిని నియమించారు. అయితే ఇటీవల ఆమె పదవి కాలం ముగియడంతో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత ఆమెను సీఎం జగన్‌ ప్రధాన సలహాదారుగా నియమించారు. రెండేళ్ల పాటు సలహాదారుగా కొనసాగే అవకాశం ఉన్నా అనూహ్యంగా ఆమెను ఎస్ఈసీగా ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.