ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ నియామకం.. నీలం సాహ్నికి కీలక పదవి..!

Tuesday, December 22nd, 2020, 07:30:23 PM IST

ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌ దాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న నీలం సాహ్ని పదవి కాలం ముగియడంతో ఆమె ఈ నెల 31న పదవి విరమణ చేయబోతున్నారు. అయితే అదే రోజు కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే వాస్తవానికి నీలం సాహ్ని పదవి కాలం జూన్ 30తోనే ముగియనుండగా, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు ఆమె సర్వీసును పొడిగించింది.

అయితే ఇక పొడిగింపు అవకాశం లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీని నియమించింది. అయితే ఎల్వీ సుబ్రమణ్యం తరువాత ఏపీ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్ని విషయంలో మొదటి నుంచి సీఎం జగన్ సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె సేవలను వినియోగించుకునేందుకు సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా రిలీజ్ చేశారు.