బాబాయ్‌ని వేసేసింది అబ్బాయే.. నారా లోకేశ్ అల్టీమేట్ కామెంట్స్..!

Wednesday, April 14th, 2021, 07:35:45 PM IST

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి తనకు కానీ, తమ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టుగానే నారా లోకేష్ నేడు అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన నారా లోకేశ్ వైఎస్ జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు గుండెపోటుతో చనిపోయారని వైసీపీ నేతలు మొదట చెప్పారని, మూడు గంటల తర్వాత పోలీసుల విచారణలో ఆయనది హత్య అని తేలింది. పోస్టుమార్టం జరగకముందే సాక్ష్యాలన్నీ చెరిపేశారని, మధ్యాహ్నం తర్వాత మాట మార్చి హత్య చేయించింది చంద్రబాబుగారే అన్నారు. అందులో నా హస్తమూ ఉందన్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షిలో వార్తలు రాశారు.

అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏమైంది? బాబాయ్ హత్య దర్యాప్తుకు ఎవరు అడ్డం పడ్డారు అని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్యతో నాకుగానీ, నా కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి పాత్ర లేదని ఆ వేంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేస్తానని, నువ్వు కూడా చేయగలవా అంటూ ఏప్రిల్ 7న సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో జగన్ రెడ్డికి సవాల్ చేసానని, ఈరోజు అలిపిరిలో నేను జగన్ రెడ్డి కోసం ఎదురుచూశాను. గరుడ సర్కిల్ దగ్గర నేను ప్రమాణం చేసాను. మరి జగన్ రెడ్డి ఎక్కడ? ప్రమాణం చెయ్యడానికి ఎందుకు రాలేదు? “హూ కిల్డ్ బాబాయ్?” అన్నది ఇప్పుడు జనానికి తెలిసిపోయింది. ఇకపై ఇలాంటి విషపు రాతలు రాస్తే, అసత్య ప్రచారాలు చేస్తే ఖబడ్ధార్ అని హెచ్చరించారు. నా ఛాలెంజ్ కి భయపడి పులివెందుల పిల్లి పారిపోయిందని, ఈ రోజు బాబాయ్ మర్డర్ మిస్టరీ వీడిపోయిందని, బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అని నారా లోకేశ్ ఆరోపించారు.