పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు – నారా లోకేశ్

Saturday, April 17th, 2021, 06:42:20 PM IST

ఏపీలో నేడు జరుగుతున్న తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నారన్న అంశం తీవ్ర వివాదంగా మారింది. దీనిపై స్పందించిన నారా లోకేశ్ పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే! ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడని అన్నారు. తిరుపతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడని ఆరోపించారు.
అయితే పెద్దిరెడ్డి మ‌నుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పిఎల్ఆర్‌ క‌ళ్యాణ ‌మండపంలో మ‌కాం వేసి దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తుంటే టీడీపీ నాయ‌కులు అడ్డుకున్నారని, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోలీసులు అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎల‌క్ష‌న్ జ‌ర‌గ‌కుండా సెల‌క్ష‌న్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న తిరుపతి ఎన్నిక‌ని అక్ర‌మార్గంలో గెల‌వాల‌ని నేరుగా తానే రంగంలోకి దిగారని విమర్శలు గుప్పించారు. తిరుప‌తి ఉప‌ఎన్నిక‌లో రిగ్గింగ్‌, దొంగ ఓట్ల‌తో నెగ్గాల‌ని వేసిన ప్ర‌ణాళిక‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసిందని, ఇప్ప‌టికైనా కేంద్ర ఎన్నిక‌‌ల క‌మిష‌న్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలని, దొంగ ఓట్లు వేసేందుకు ఇత‌ర ప్రాంతాల త‌ర‌లివ‌చ్చిన వేలాది మందిని అరెస్ట్‌చేసి సూత్ర‌ధారులపై చ‌ర్య‌లు తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.