మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి మానవత్వంతో ఆలోచించండి.. జగన్‌కు నారా లోకేశ్ సజేషన్..!

Tuesday, May 11th, 2021, 08:26:37 PM IST

Nara_Lokesh
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో వారు చనిపోలేదు, దయ లేని జగన్ ప్రభుత్వం చంపేసింది. 11 మంది కాదు 30 మంది మరణించారు అని రుయా ఆసుపత్రి ముందు నిరసన తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక మహిళా ప్రత్యక్ష సాక్షి. 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది అనేది అబద్ధం, 11 మందే చనిపోయారు అనేది అంతకంటే పెద్ద అబద్ధం. అధికారులు వచ్చి మా ముందు మాట్లాడాలి అంటూ బాధితులు నిలదీస్తున్నారని లోకేశ్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికైనా ప్రభుత్వం దొంగ మాటలు, దొంగ లెక్కలు మాని వాస్తవాలు బయట పెట్టాలని, మీడియాపై ఆంక్షలు, ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులతో వాస్తవాలు దాగవని అన్నారు. ఆక్సిజన్ కొరతతో రాష్ట్రంలో ఇప్పటికే 76 మందికి పైగా చనిపోయారని, ఇంకెంత మంది ప్రాణాలు బలిగొంటారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి మానవత్వంతో ఆలోచించండి జగన్ రెడ్డి గారు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన వారివి ప్రభుత్వ హత్యలుగా పరిగణించి వారి కుటుంబ సభ్యులను తక్షణమే ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.