జగన్ సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ లేదు – నారా లోకేశ్

Wednesday, December 9th, 2020, 06:35:56 PM IST


పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. చట్టాల పేరు చెబుతూ కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలపై రాష్ట్రంలో వరుసగా జరుగుతన్న అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని, దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైన విషయం బయటకి రాకుండా చెయ్యడానికి ప్రభుత్వం పెడుతున్న శ్రద్ద మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలని సూచించారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.