పనిగట్టుకొని వేధించడమే పనిగా పెట్టుకున్నారు.. జగన్ సర్కార్‌పై లోకేశ్ సీరియస్..!

Tuesday, November 10th, 2020, 02:54:15 PM IST

Lokesh

ఇటీవల నంద్యాల‌లో ముస్లిం మైనారిటీ అబ్దుల్ స‌లాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ ఘటనపై మరోసారి స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని, అడ్డంగా న‌రికేసి.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు చేయ‌డం వైకాపా స‌ర్కారుకి అల‌వాటుగా మారిందని అన్నారు. అబ్దుల్ స‌లాం కుటుంబాన్ని వెంటాడి హింసించి సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డేలా చేసి ఇప్పుడు ప‌రిహారం ప్ర‌క‌టించారని సీరియస్ అయ్యారు.

బంగారు భ‌విష్య‌త్తు గ‌ల 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ళ కుమారుడు కలందర్‌ని మీ 25 లక్షలు వెనక్కి తీసుకొస్తాయా జగన్ రెడ్డి గారూ అని ప్రశ్నించారు. ఏపీలో ముస్లిం మైనారిటీల‌పై దాడుల‌కు అంతే లేకుండా పోయిందని, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ గారిని మండ‌లిలోనే ఘోరంగా అవ‌మానించిన స‌ర్కారు ఇది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో త‌న కూతురిని వేధించిన వారిపై ఫిర్యాదు చేసిన తండ్రి సత్తార్ ఎస్పీ కార్యాల‌యం ఎదుటే ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డితే స్పందించే వారే లేరని, అబ్దుల్ స‌లాం గారి కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కాపాడే ప్రయత్నాలు ఆపి కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.