మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్..!

Saturday, September 12th, 2020, 06:23:59 PM IST

వైసీపీ సర్కార్ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వాస్తవాలను ప్రసారం చేసారని ఓ డిజిటల్ మీడియాపై ఏపీ సర్కార్ సీఐడీ కేసు నమోదు చేయడాన్ని ఏపీ హైకోర్ట్ తీవ్రంగా తప్పుపట్టింది. దీనిపై ప్రభుత్వంపై, అధికారులపై కోర్టు మండిపడింది. అయితే దీనిపై స్పందించిన నారా లోకేశ్ మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఖాకిస్వామ్యంలో ఉన్నామా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోందని అన్నారు. జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం అత్యుత్సాహం, “ఖాకిస్టోక్రసీ” ప్రదర్శిస్తున్నారు కొంత మంది అధికారులు అని అన్నారు.

అయితే గతంలో కూడా ఇలానే చేసి కొంత మంది అధికారులు జగన్ రెడ్డి గారితో కలిసి ఊచలు లెక్కపెట్టారని, ఇప్పుడు పత్రికా స్వేచ్ఛని హరించడానికి కూడా వెనకాడటం లేదని, కనీసం నోటీసు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ, విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను ప్రసారం చేశారన్న అక్కసుతో తెలుగుఒనె.చొం ఎండీ రవిశంకర్ గారిపై అక్రమ కేసు పెట్టి వేధించారని, ఈ కేసుని కోర్టు కొట్టివెయ్యడం అరాచకవాదులకు చెంపపెట్టు అన్నారు. పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవడానికి అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.