‘సంపూర్ణ పోషణ ప్లస్’ అంటే ఇదేనా.. వైసీపీ సర్కార్‌పై మండిపడ్డ నారా లోకేశ్..!

Wednesday, September 9th, 2020, 07:28:30 PM IST

ఏపీలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందచేసేందుకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను నిన్న సీఎం జగన్ ప్రారంభించారు. అయితే వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం అమలుకు ప్రభుత్వం 87.12 కోట్లు ఖర్చు చేస్తుందని, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం అమలు కొరకై 591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఇందులో భాగంగా ఇచ్చే వస్తువులను కల్తీ చేస్తున్నట్టు ఓ వీడియో బయటకొచ్చింది.

అయితే ఆ వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన నారా లోకేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కల్తీ రాజ్యంలో, కొనసాగుతున్న కల్తీ పనులు అని చివరకు గర్భిణులకు, బాలింతలకు ఇచ్చే పాలను కూడా కల్తీ చేస్తారా అని ప్రశ్నించారు. ‘సంపూర్ణ పోషణ ప్లస్’ అంటే ఇదేనా అని మంత్రులు బూతులతో బిజీగా ఉంటే, ఇవి పట్టించుకునేది ఎవరు అని కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన పై ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది అంటూ నిలదీశారు.