కోర్టులు మీపై సుమోటోగా కేసు న‌మోదు చేయాలి.. డీజీపీపై నారా లోకేశ్ సీరియస్..!

Saturday, January 16th, 2021, 01:59:55 AM IST

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. విగ్ర‌హాలు ధ్వంసం చేసింది దొంగ‌లు, పిచ్చోళ్ల‌ని నిన్న చెప్పిన డీజీపీ దొరా, నేడు రాజ‌కీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది! రాత్రికి తాడేప‌ల్లి కొంపలో జగన్ మార్క్ భోగి ప‌ళ్లేమైనా మీకు పోశారా అని లోకేశ్ ప్రశ్నించారు. మీరు విడుద‌ల‌ చేసిన జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన‌ వైసీపీ నేత దామోదర్ రెడ్డి పేరు ఎందుకు లేదని అడిగారు.

అంతేకాదు ఓంకార క్షేత్రంలో అర్చ‌కుల‌ను చిత‌క్కొట్టిన వైసీపీ నేత ప్రతాపరెడ్డి పేరు ఎందుకు ప్ర‌స్తావించ‌లేదు, ఆంజ‌నేయుడు చేయి విరిగితే ర‌క్త‌మొస్తుందా? రాముడి తల తెగితే విగ్ర‌హం ప్రాణం పోతుందా? అని హిందుత్వంపైనే దాడికి దిగిన బూతుల‌ మంత్రి నానిపై కేసు ఎందుకు పెట్ట‌లేదు అని నిలదీశారు. హిందుత్వం మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నించేలా దాడులు జ‌రుగుతుంటే నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం చేత‌కాక చేవ‌చ‌చ్చిన మీపై ముందు కేసుపెట్టాలని, త‌ప్పుడు స‌మాచారంతో రాష్ట్ర ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నందుకు కోర్టులు మీపై సుమోటోగా కేసు న‌మోదు చేయాలని నారా లోకేశ్ అన్నారు.