జగన్ మాట మార్చి, మడమ తిప్పి నేటికి 300 రోజులు – నారా లోకేశ్

Monday, October 12th, 2020, 01:26:15 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు 300 రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. వారి పోరాటానికి మద్దతుగా నేడు రాజధాని గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పర్యటించి వైసీపీ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. అంతేకాదు ట్విట్టర్ వేదికగా కూడా స్పందిస్తూ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నా వెనుకాడని రాజధాని రైతుల సాహసం నిజంగా స్ఫూర్తినిస్తోందని అన్నారు.

అయితే జై అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులైందని, హింసించే 24వ రాజు మాట మార్చి, మడమ తిప్పి నేటికి 300 రోజులు అని ఎద్దేచా చేశాడు. అరెస్టులు, అవమానాలు, కేసులతో రాబందుల్లా వెంటాడుతున్నా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అంటున్న రైతులు, మహిళలు, యువత, ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. మనస్సున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది. మూర్ఖుడికి హింసించడం మాత్రమే తెలుస్తుంది. మనం మూర్ఖుడితో పోరాటం చేస్తున్నాం. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఓర్పు, సహనంతో ఉంటే అంతిమ విజయం మనదే అని తెలిపారు.