జగన్ భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారు – నారా లోకేశ్

Thursday, August 13th, 2020, 12:58:00 PM IST

ఏపీ సీఎం జగన్ భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన పెట్టుకున్నారని, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ, మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని అన్నారు.

అయితే ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి 23 మందిని గాయపర్చారని, గిరిజన యువకుడు డబ్బా బాబ్లీని అత్యంత కిరాతకంగా హత్యచేసారని అన్నారు. గిరిజన మహిళని అప్పు తీర్చలేదంటూ వైకాపా నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు మరో గిరిజన యువకుడుని హత్య చేయడం దారుణమని అన్నారు. అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని వెంటనే దళితులు, గిరిజన కుటుంబాలకు అందజేయ్యాలని, డబ్బా బాబ్లీని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.