ఉల్లి రైతులను ఆదుకోవాలి.. జగన్ సర్కార్‌కి లోకేశ్ డిమాండ్..!

Saturday, August 8th, 2020, 09:16:05 PM IST

Nara_Lokesh
ఏపీలో ఉల్లి పంటకు మద్దతు ధర రాక రైతులు ఆర్ధికంగా తీవ్రంగా నష్ట పోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 34 లక్షలు క్వింటాల్ ఉల్లి దిగుబడి వస్తోందని, ఉల్లి సాగు చేసిన రైతులు పంట కొనుగోలు లేకపోవటంతో, మద్దతు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఎకరాకు 70 నుంచి 80 వేలు వెచ్చించి ఉల్లి పంటను వేసిన రైతులకు కన్నీరు మిగిలిందని, ఉల్లి పంటలు అమ్మకాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన కర్నూల్ మార్కెట్ యార్డ్ కరోనా తీవ్రత కారణంగా మూతబడిందని, ప్రభుత్వం చెపుతున్నట్లుగా సచివాలయాల వద్ద కొనుగోలు జరగటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉల్లిపంటను రైతుల వద్ద నుండి వారి గ్రామంలోనే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.