మీలో ఉన్న అహాన్ని కూల్చేయండి.. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై నారా లోకేశ్ కౌంటర్..!

Friday, November 27th, 2020, 01:26:23 AM IST


గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ 4,700 ఎకరాలున్న హుస్సేన్‌సాగర్ ఇవాళ 700 ఎకరాలు కూడా లేదని అన్నారు. అక్రమ కట్టడాలను కూల్చడం కాదు దమ్ముంటే హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మహనీయులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు, శ్రీ. పి.వి నరసింహారావు గారి సమాధులు కూలుస్తా అని అక్బరుద్దీన్ తన వ్యక్తిత్వాన్ని కూల్చేసుకున్నారని మండిపడ్డారు. గొప్ప వ్యక్తుల సమాధులు కూల్చేబదులు మీలో ఉన్న అహాన్ని కూలిస్తే, మిమ్మల్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా మీకు ఓట్లు వేస్తున్న ప్రజలకు న్యాయం జరుగుతుందని ట్వీట్ చేశారు.