28 మంది వైకాపా ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం – నారా లోకేశ్

Friday, February 5th, 2021, 07:12:51 PM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం జగన్ తాకట్టు పెడుతున్నాడని, 28 మంది వైకాపా ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం అని, 32 మంది ప్రాణాలు త్యాగంచేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని వేలాది మంది ప్ర‌త్య‌క్షంగా, ల‌క్ష‌లాదిమంది ప‌రోక్షంగానూ ఇందులో ఉపాధి పొందుతున్నారని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే మ‌ణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి మౌనం దాల్చ‌డం దేనికి సంకేతమని లోకేశ్ ప్రశ్నించారు.

అంతేకాదు ఇలా ఒక్కో ప‌రిశ్ర‌మ అమ్మేయ‌డం, అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే జ‌గ‌న్‌రెడ్డి గారూ! కాకినాడ పోర్టు విజయసాయి రెడ్డి అల్లుడికి వ‌ర‌క‌ట్నంగా రాసిచ్చేశారు. విశాఖ ఏజెన్సీలో లేట‌రైట్ గ‌నులు బాబాయ్ సుబ్బారెడ్డికి బ‌హూక‌రించారు. త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారు.‌ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేసుకోబోతున్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేశ్ హెచ్చరించారు.