టీడీపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థుల్ని చంపేశారు – నారా లోకేష్

Monday, February 22nd, 2021, 01:27:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరించిన తీరు పట్ల తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డెమోక్రసీ కి, జగన్ మోనోక్రసి కి మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీ దే అయినా అసలు సిసలు గెలుపు తెలుగు దేశం పార్టీ దే అంటూ నారా లోకేష్ అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం తో అడ్డుకున్నారు అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. మన దేశానికి అర్థరాత్రి స్వాతంత్ర్యం వస్తే, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో అర్థరాత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి స్వాతంత్య్రం వచ్చింది అంటూ నారా లోకేష్ అన్నారు. అయితే తెలుగు దేశం పార్టీ మద్దతు తో పోటీ చేసే అభ్యర్థుల్ని చంపేశారు అని, నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారు అని, బెదిరించారు అని, భయపెట్టారు అంటూ నారా లోకేష్ అన్నారు.

అంతేకాక కట్టేసి కొట్టారు అని, అయినా వెనక్కి తగ్గని తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజ లో ఉంటే కరెంట్ నిలిపివేశారు అని వ్యాఖ్యానించారు. కౌంటింగ్ కేంద్రాలకు తాళాలు వేశారు అని, పోలీసులను బెదిరించారు అని, దాడులు చేశారు అని, తెలుగు దేశం పార్టీ మద్దతు దారులు గెలిచిన చోట్ల రీ కౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్రకటించుకున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ లోనే ఎన్నడూ లేని విధంగా జగన్ రెడ్డి అరాచకాలకి పాల్పడినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని నారా లోకేష్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు అంటూ నారా లోకేష్ అన్నారు.