జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అన్నీ వెధవ పనులే – నారా లోకేష్

Thursday, March 4th, 2021, 01:27:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న నారా లోకేష్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి ఓ దరిద్రపు పాదం, పెట్టిన దగ్గర నుండి మనకి సమస్యలే సమస్యలు అంటూ నారా లోకేష్ విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ తో ప్రారంభం అయింది, కరోనా తో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని వ్యాఖ్యానించారు. ఎవరైనా సుఖంగా, హాయిగా బ్రతికారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఇటు నుండి వంద ఇచ్చి, అటు నుండి వెయ్యి లాక్కుంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎన్నికల ముందు రేషన్ డోర్ డెలివరీ అంటూ పెద్ద పెద్ద యాడ్స్ వేశారు అని చెప్పుకొచ్చారు. సన్న బియ్యం డోర్ డెలివరీ అంటూ పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చారనీ పేర్కొన్నారు. అయితే ఆ డోర్ డెలివరీ మన ఇంటి డోర్ డెలివరీ కాదు అని, ఆ వ్యాన్ డోర్ వద్ద మనం నిలుచోవాలి అంటూ చెప్పుకొచ్చారు. 10 వేల బండ్లు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు అని వ్యాఖ్యానించారు. అయితే దీనికి బదులుగా ప్రజలను లబ్ది చేకూర్చే ఏదైనా పథకం లేదా, అన్నా కాంటీన్ లను ప్రారంభిస్తే బావుండేది అని అన్నారు. సన్న బియ్యం పై సైతం విమర్శలు చేశారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.