తిరుమల కొండ మీద రాజకీయ భజన చెయ్యడం దారుణం – నారా లోకేశ్

Thursday, December 24th, 2020, 01:00:27 AM IST

Nara_Lokesh

ఏపీ సీఎం జగన్ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండీ తిరుమల పవిత్రతను మంటగలిపే చర్యలకు పాల్పడుతున్నారని, లడ్డూ ప్రసాదం రేటు పెంచడం దగ్గర నుండి డిక్లరేషన్ వివాదం వరకూ అన్నీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలేనని అభివర్ణించారు.

అయితే శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడం హేయమైన చర్య అని, ఈ ఘటన ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. వైకాపా నాయకుడైతే చాలా? 2 వేల మందితో వచ్చినా తెరుచుకున్న ద్వారాలు సామాన్య భక్తుడుకి ఎందుకు మూసుకుపోయాయని ప్రశ్నించారు. అంతేకాదు తిరుమల కొండ మీద రాజకీయ భజన చెయ్యడం దారుణమని, భక్తులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు, మనోభావాలను దెబ్బతీసిన టీటీడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని లోకేశ్ డిమాండ్ చేశారు.