ప్రజలను ఆదుకొనే తీరిక లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి – నారా లోకేష్

Monday, October 19th, 2020, 02:01:44 PM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి అధికార పార్టీ తీరు పై ఘాటు విమర్శలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు నారా లోకేష్ పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన నేపద్యం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వరదలతో కష్ట నష్టాల పాలు అయిన ప్రజలను ఆదుకొనే తీరిక లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి అంటూ వైసీపీ తీరు పై ఘాటు విమర్శలు చేశారు. అయితే కనీసం తన పర్యటన తో అయినా ప్రజల బాధలు, పాలకుల దృష్టికి తీసుకు వెళ్లాలన్న ఆలోచనతో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు నారా లోకేష్. జగ్గంపేట నియోజక వర్గం రామవరం గ్రామంలో వరద ఉదృతి కి కుప్ప కూలిన ఇళ్లు, నీట మునిగిన పంట పొలాలను చూస్తుంటే మనసు చలించిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను, గ్రామస్తులను పరామర్శించి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. అయితే నారా లోకేష్ తన పర్యటనకు సంబంధించిన పలు ఫొటోలను సైతం సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు.