నియంత జగన్ రెడ్డి కొమ్ములు వంచి మీకు న్యాయం జరిగేలా… – నారా లోకేష్

Wednesday, December 23rd, 2020, 01:23:19 PM IST


జాతీయ రైతు దినోత్సవం తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రుణాలు అందించి, కౌలు రైతుల హక్కులు కాపాడేందుకు చట్టం తెచ్చిన రైతు బంధు చరణ్ సింగ్ గారి జయంతిని జాతీయ రైతు దినోత్సవం గా జరపడం మన ఆనవాయితీ అని అన్నారు. నాటి పాలకులు రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సంస్కరణలు తీసుకు వస్తే, నేడు రైతుల పాలిట రాబందు గా మారిన జగన్ అంటూ నారా లోకేష్ అన్నారు.

అయితే రైతుల భవిష్యత్తు అంధకారం చేసేందుకు మీటర్లు బిగిస్తున్నాడు అని, జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాల వలన రోజుకో అన్నదాత ఆత్మహత్యకి పాల్పడటం ఆవేదనకు గురిచేస్తోంది అని విమర్శించారు. అయితే ఒక పక్క పొలంలో రైతు సాయం కోసం ఎదురుచూస్తుంటే మన వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కట్టేవి కూలగొట్టడం, వీలు కాకపోతే రంగులేయడం, అదీ సాధ్యం కాకపోతే స్టిక్కర్లు అంటించడం మాత్రమే తెలిసిన జగన్ రెడ్డి, చరణ్ సింగ్ జయంతి రోజున జరగాల్సిన రైతు దినోత్సవం ను కూడా తన తండ్రి వైఎస్ జయంతి కి మార్చుకున్నాడు అంటూ విమర్శించారు.

అయితే రైతులు ఆత్మ స్థైర్యం తో ఉండాలి అని, నియంత జగన్ రెడ్డి కొమ్ములు వంచి మీకు న్యాయం జరిగేలా పోరాడటానికి నేను మీ ముందు ఉంటాను అని నారా లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ అన్ని విధాలుగా రైతన్నలకు అండగా నిలబదుతుంది అని అన్నారు. దేశ సమైక్యతకు ఆయువు పట్టు గా నిలుస్తున్న మా అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు అంటూ నారా లోకేష్ అన్నారు.