మునిసిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం – నారా లోకేష్

Monday, March 15th, 2021, 08:27:49 AM IST

Nara_Lokesh
మునిసిపల్ ఎన్నికల ఫలితాల పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అని అన్నారు. ఎన్నికల కోసం రాత్రనక, పగలనక శ్రమించిన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అరాచకాన్ని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార మదాన్ని ఎదిరించి, నిలిచి గెలిచిన వారికి, పోరాడి ఓడిన వారికి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎన్నికలే జరపకూడదనుకున్న జగన్ రెడ్డి సర్కారు అప్రజాస్వామిక వైఖరి ను ప్రజల ముందు ఉంచడం లో మనం సక్సెస్ అయ్యాం అని అన్నారు.

అయితే ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామని బెదిరించినా, నామినేషన్లు వేసిన కొందరిని చంపేసినా, అదరక బెదరక తెలుగు దేశం సైనికులు ఎన్నికల బరిలో నిలిచారు అని అన్నారు. వైసీపీ కి ఓట్లు వేయకుంటే పథకాలను ఆపేస్తామని ఓటర్లను భయపెట్టి జరిపిన ఎన్నికల ఫలితాలు చూసి నిరాశ చెందొద్దు అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం గా, ప్రజాసమస్యల పై తెలుగు దేశం తన పోరాటాన్ని కొనసాగిస్తుంది అని అన్నారు. ఆ పోరాటం లో క్రమ శిక్షణ, అంకిత భావం కలిగిన సైనికులు గా పని చేద్దాం అని అన్నారు. ప్రజలకు అండగా నిలిచి వారికి మరింత చేరువయ్యేందుకు కృషి చేద్దాం అని తెలిపారు.