బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాక్.. ఏడాది జైలు శిక్ష..!

Friday, January 29th, 2021, 09:00:58 PM IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాక్ తగిలింది. నాంపల్లి స్పెషల్‌ కోర్టు రాజాసింగ్‌కు జైలు శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్ల క్రితం బీఫ్‌ ఫెస్టివల్‌ ఘటనలో రాజాసింగ్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే ఆ సందర్భంలో ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన నాంపల్లి స్పెషల్‌ కోర్టు రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్షను విధించింది.

అయితే దీనిపై రాజాసింగ్ వెంటనే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా వాదనలు విన్న కోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే దీనిపై నెలరోజుల్లో హైకోర్టులో తేల్చుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఎంపీ బండి సంజయ్‌, మంత్రి మల్లారెడ్డిలపై వేర్వేరుగా నమోదైన పలు కేసులపై కూడా ఈ రోజు నాంపల్లి స్పెషల్‌ కోర్టు విచారణ జరిపింది. అయితే కరీంనగర్‌లో బండి సంజయ్‌పై నమోదైన మూడు కేసులను న్యాయస్థానం కొట్టేయగా, మంత్రి మల్లారెడ్డిపై నమోదైన కేసులను కోర్టు కొట్టేయలేదు.