సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన నాగార్జున సాగర్ బీజేపీ నేత..!

Wednesday, March 31st, 2021, 02:06:31 AM IST


టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో నాగార్జున సాగర్ బీజేపీ నేత అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ అంజయ్య యాదవ్ పార్టీనీ వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన అనంతరం అనూహ్యంగా వ్యవహరించిన బీజేపీ తమ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ నాయక్ పేరును ప్రకటించింది.

అయితే బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో కడారి అంజయ్య యాదవ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో అంజయ్య యాదవ్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, సైదిరెడ్డి తమ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఫామ్ హౌస్‌లో అంజయ్యకు సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు అంజయ్య యాదవ్‌కు సీఎం కేసీఆర్‌ కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు.