పనికిమాలిన మాటలు వద్దు.. ప్రకాష్ రాజ్‌పై నాగబాబు ఫైర్..!

Saturday, November 28th, 2020, 12:18:57 PM IST

తెలంగాణలో జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పార్టీలు, నేతల మధ్య మాటల యుద్ధం కాక రేపుతుంది. ఈ సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్‌పై కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసింది ముమ్మాటికి తప్పేనని, ఒక పార్టీకి అధినేత అయి ఉండి మరో పార్టీకి ఓటు వేయమని పవన్ కళ్యాణ్ అడగడం పార్టీ కార్యకర్తలతో పాటు తనను కూడా నిరుత్సాహానికి గురి చేసిందని అన్నారు. ఇదంతా గమనిస్తుంటే పవన్ ఓ రాజకీయ ఊసరవెల్లిలా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

అయితే ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలలో అనేక సార్లు నిర్ణయాలు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయం వెనక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేయడం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయనేది మా నమ్మకమని అన్నారు. ఎవడికి పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలిన వాడు ఆయనను విమర్శిస్తున్నారు. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్‌లోనే అర్ధమైందని, సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుందని నాగబాబు అన్నారు.

నీ ఉద్దేశ్యంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించడంలో తప్పులేదని, అలాగే బీజేపీ కానీ మరే ఇతర పార్టీ కానీ ప్రజలకు మంచి చేస్తే హర్షించగలగాలని సూచించారు. విమర్శించటం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురుంచి ఏం చెప్పగలమని అన్నారు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీతో, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన కూటమి శక్తిని ఆపలేరని అన్నారు. డైరెక్టర్లను కాకపట్టి డబ్బులకు నిర్మాతలను ఎన్ని రకాలుగా హింస పెట్టావో ఇంకా మాకు గుర్తున్నాయని ముందు నువ్వు మంచి మనిషిగా మారి అప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనిషి, నిస్వార్ధపరుడైన నాయకుడిని విమర్శించు అని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వాన్ని నీవు నోటికొచ్చినట్టు విమర్శించినా నిన్ను ఎవరు ఏమీ అనలేదంటే అది బీజేపీ డెమోక్రసీకి ఇచ్చే విలువ అని అర్ధం చేసుకో అని సూచించారు. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన తమ సత్తా చాటబోతున్నాయని, మీడియా అడిగిందని ఒళ్ళు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకని నాగబాబు కౌంటరిచ్చారు.