గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన గంగవ్వ..!

Monday, November 16th, 2020, 11:06:49 PM IST

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. రాను రానూ ఆ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది. అయితే తాజాగా బిగ్‌బాస్ సీజన్ 4 భాగస్వామురాలు, మై విలేజ్ షో గంగవ్వ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపళ్లి గ్రామంలో తన ప్రకృతి వనంలో గంగవ్వ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజలో భాగంగా తాను ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలను నాటానని అన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కు గంగవ్వ కృతజ్ఞతలు తెలియచేశారు.