రాయల్ ఛాలెంజర్స్‌కి భంగపాటు.. ప్లేఆఫ్స్‌కి చేరిన ముంబై..!

Thursday, October 29th, 2020, 01:19:05 AM IST

ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన పోరులో ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందడంతో ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది. దేవదత్ పడిక్కల్ 74 పరుగులతో బ్యాటు ఝులిపించగా, జోష్ ఫిలిప్ 33 పరుగులతో రాణించాడు. అయితే మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఎవరూ పెద్దగా రాణించలేదు.

అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు డికాక్, ఇషాన్ కిషన్ మంచి శుభారంభాన్ని అందించారు. అయితే వారిద్దరు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 43 బంతుల్లో 79 పరుగులు చేయడమే కాకుండా ఆఖరి దాకా క్రీజులో నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 19.1 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ముంబై లక్ష్యాన్ని చేధించింది.