ఉద్యమంలోకి మళ్ళీ రాలేను క్షమించండి.. ముద్రగడ పద్మనాభం క్లారిటీ..!

Monday, September 21st, 2020, 06:45:59 PM IST


కాపు ఉద్యమనేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం వ్యక్తిగత కారణాల వలన కొద్ది రోజుల క్రితమే కాపు ఉద్యమం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఉద్యమం ద్వారా డబ్బు కానీ, పదవులు కానీ పొందాలని నేను ఏనాడూ అనుకోలేదని, ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగాను, ఆరోగ్యం పరంగాను చాలా నష్టపోయానని కానీ కాపు జాతికి మేలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే కాపు జాతి అభివృద్ధి కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ముద్రగడ ప్రస్తుతం కాపు ఉద్యమంలో లేకపోవడం తీరని లోటుగా కనిపిస్తుంది. అయితే కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఉద్యమంలోకి ముద్రగడ తిరిగి రావాలని 13 జిల్లాల జేఏసీ నేతలు కోరారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నేడు ముద్రగడను జేఏసీ నేతలు కలిసి ఉద్యమంలోకి తిరిగి ఆహ్వానించగా తాను మళ్ళీ ఉద్యమంలోకి రాలేనని పద్మనాభం తేల్చి చెప్పారు. మీ కోరిక గౌరవించనందుకు నన్ను క్షమించండి, వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటా నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని ముద్రగడ వారికి బదులిచ్చారు.