డెమోక్రసీ అంటే జనస్వామ్యమా లేక మనస్వామ్యమా?

Sunday, January 24th, 2021, 04:05:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది.అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై, ఆయన వ్యవహరిస్తున్న తీరు పై అధికార పార్టీ కి చెందిన నేతలు, ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ కి చెందిన కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

నిమ్మగడ్డ గారూ, డెమోక్రసీ అంటే జన స్వామ్యమా లేక మన స్వామ్యమా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తనకు ముందు నిమ్మగడ్డ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బానిస అంటే కట్టప్ప పాత్ర గుర్తుకు వస్తుంది అని, అది కల్పిత గాథ అని, అంతకు వందరెట్లు కరుడుగట్టిన గులాంగిరీ ప్రదర్శించే నిమ్మగడ్డ మన మధ్యనే ఉన్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు సేవలో పులకిస్తూ ప్రజల ప్రాణాలు తీయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. కట్టప్ప కథ సుఖాంతం అయినా, నిమ్మగడ్డ ను మాత్రం రాష్ట్రం ఎన్నటికీ క్షమించదు అంటూ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అయితే పలువురు నెటిజన్లు విజయసాయి రెడ్డి తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలు, 151 సీట్లు ఉన్నప్పటికి కూడా స్థానిక ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.