ప్లేస్, డేట్, టైమ్ నువ్వే చెప్పు.. లోకేశ్ సవాల్ స్వీకరించిన విజయసాయి రెడ్డి..!

Saturday, January 2nd, 2021, 09:20:56 PM IST

విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. వైసీపీ, టీడీపీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. దేవుడి విగ్రహం ధ్వంసంపై ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండ కింద మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి ఆలయంపై దాడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పనే అని, రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు.

అంతేకాదు ఈ ఘటనపై టీడీపీ నేత లోకేశ్‌ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తానని, చర్చకు నేను సిద్ధం ప్లేస్, డేట్, టైమ్ చెప్పాలని విజయసాయి రెడ్డి లోకేశ్‌కు ప్రతి సవాల్ విసిరారు. కుట్రలకు టీడీపీ అధినేత చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌ అని, ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా చంద్రబాబు తన వల్లే అంటారని, అయితే చెడు జరిగితే ఇతరులపైకి నెట్టడం ఆయనకు అలవాటుగా మారిందని అన్నరు.

అయితే విజయసాయి రెడ్డి ప్రతి సవాల్‌పై స్పందించిన నారా లోకేశ్ నేను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోందని, ఏ1 కి దమ్మూ,ధైర్యం లేదా అని ప్రశ్నించారు. దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారని, నాపై వైకాపా చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని తేలిపోయిందని అన్నారు. మరోసారి జగన్‌కు సవాల్ విసురుతున్నా నాపై మీరు చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పన్న పై ప్రమాణం చెయ్యడానికి నేను సిద్దం, మీరు సిద్దమా అని ప్రశ్నించారు.