ఏపీకి అలా, తెలంగాణకు ఇలా.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Monday, August 17th, 2020, 12:00:42 AM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని లేనట్టే తెలంగాణకు సచివాలయం లేకుండా పోయిందని అన్నారు. కేంద్రంలో బీజేపీ హిందూత్వ ఎజెండాతో గెలిస్తే, తెలంగాణలో కేసీఆర్ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చారని అన్నారు.

అంతేకాదు గతంలో రాజులు రాజ్యాలపై గెలిచిన తర్వాత పాతవాటిని ధ్వంసం చేసేవారని, అలానే నిజాం, కుతుబ్ షాహీల కాలం నాటి జ్ఞాపకాలను కేసీఆర్ ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న సచివాలయం కూల్చడం కూడా అందులోనే భాగమని అన్నారు. సచివాలయంలో దేవాలయం, మసీదు కూల్చివేతపై ప్రభుత్వం పై క్రిమినల్ కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానికంగా నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు.