ప్రధాని మోదీ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదు – ఎంపీ రేవంత్ రెడ్డి

Saturday, November 28th, 2020, 08:52:47 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక ఎంపీనైనా తనకు ఆహ్వానం లేకపోవడం ప్రోటోకాల్‌ ఉల్లంఘనే అని, ఇది ఓ ప్రజా ప్రతినిధిని అవమానించడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని పర్యటన వ్యక్తిగతం కాదని, బీజేపీ సొంత కార్యక్రమం అంతకంటే కాదని విమర్శలు చేశారు. ప్రధాని పర్యటనకు తనను ఆహ్వానించకపోవడంపై లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తానని, లోక్‌సభ సమావేశాల్లో తన నిరసన తెలియజేస్తానని అన్నారు.

ఇదిలా ఉంటే భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. అయితే ప్రధాని పర్యటనకు కేవలం 5 మందికే మాత్రమే ఆహ్వానం అందింది. సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ సీపీ సజ్జనార్, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్‌లు మాత్రమే హాజర్ కావాలని పీఎంవో తెలిపింది. అయితే రాష్ట్ర గవర్నర్, సీఎం కేసీఆర్‌లకు కూడా మోదీ పర్యటనకు ఆహ్వానం అందకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.