ప్రధాని మోదీతో ముగిసిన ఎంపీ రఘురామ భేటీ.. ఏం చర్చించారంటే..!

Sunday, February 14th, 2021, 01:34:17 AM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు నేడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు ప్రధాని మోదీతో 18 నిమిషాల సమావేశం అద్భుతంగా సాగిందని చెప్పుకొచ్చారు. మీ చేతులతో శంకుస్థాపన చేసిన అమరావతిని నిలిపివేస్తే పేద రైతులకు అన్యాయం జరుగుతుందని మోదీకి చెప్పానని అలాగే రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో కూడా జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిపారు.

అయితే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయొద్దని కూడా మొదీ గారితో చెప్పానని రఘురామ అన్నారు. అయితే రాష్ట్రంలో చర్చిల నిర్మాణాలకు వైసీపీ ప్రభుత్వం టెండర్లకు పిలిచిందని చెప్పానని దీనికి ప్రధాని మోదీ గారు విస్మయానికి గురయ్యారని అన్నారు. చర్చిల నిర్మాణానికి టెండర్లా అని ప్రశ్నిస్తూ ఆశ్చర్యానికి గురయ్యారని, ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారని అన్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని మోదీ కోరినట్టు రఘురామ తెలిపారు.