రాష్ట్రపతికి ఎంపీ రఘురామ సరికొత్త విన్నపం.. అదేమిటంటే?

Tuesday, October 13th, 2020, 03:34:18 PM IST


ఏపీలో న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నం గురుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పుకొస్తూ దీనిని ధరిత్రి ఎరుగని చరిత్రగా అభివర్ణించారు. న్యాయమూర్తులకు ఉద్దేశ్యాలు ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నా దాడులు ఆగడం లేదని అన్నారు. అయితే పార్లమెంట్‌కు సైతం పరిమితులు ఉన్నాయని, కోర్టులను దూషించిన జాబితాలో వైసీపీ నేతలు నందిగం సురేశ్, ఆమంచి కృష్ణ మోహన్, మరికొందరు రెడ్ల పేర్లు జాబితాలో ఉన్నాయని అన్నారు. సోషల్ మీడియా దూషణాలపై ఆరు నెలలుగా పిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

అయితే వైసీపీ నేతలపై మాత్రం ఎవరైనా ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తే మాత్రం సెక్షన్లపై సెక్షన్లు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని అన్నారు. అయితే చేతకాని, నిస్సహాయ, నిస్సిగ్గు సీబీసీఐడీ రాష్ట్రంలో ఉందని అన్నారు. ఇకపోతే ఆనాడు మహాభారత కాలంలో కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగితే, ఈనాడు న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోందని ఆరోపించారు. అయితే ఈ అభినవ కౌరవసభలో తానూ భాగస్వామిని అయినందుకు సిగ్గుపడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే వ్యవస్థలను వివస్త్రలను చేసే ప్రయత్నం చేసిన వారెవరికి మనుగడ ఉండదని ఆనాడు ద్రౌపదిని గోవిందుడు(శ్రీకృష్ణుడు) కాపాడారని, నేడు న్యాయవ్యవస్థను కోవిందుడు (రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్) కాపాడాలని తాను వేడుకుంటున్నట్టు రఘురామ చెప్పుకొచ్చారు.