ప్రధాని మోదీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఎందుకంటే?

Wednesday, October 21st, 2020, 05:51:12 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీసీల్లో కులానికో సొసైటీ పెట్టి వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని అన్నారు. విభజించి, పాలించే చర్యలను వైసీపీ ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. అంతేకాదు రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన పెరిగిపోయిందని అన్నారు.

అయితే రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనపై ప్రధాని మోదీకి లేఖ రాశానని అన్నారు. అంతేకాదు కేవలం 1.8 శాతం ఉన్న క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతపై విచారణ జరిపి అసలు నిజాలను తేల్చాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌లో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చారని కానీ ఏపీలో మాత్రం తెలుగు భాషను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్లాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.