సీఎం జగన్‌కు మరో లేఖ రాసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు..!

Friday, August 21st, 2020, 11:33:02 AM IST

ఏపీ సీఎం జగన్‌కి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రి గారి వ్యాఖ్యలు ఉన్నాయని, హిందూ మత పెద్దలను సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యల వల్ల మీకు, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఒక బాధ్యతగల పార్లమెంట్ సభ్యునిగా, హిందువుగా ప్రజల మనోభావాలను మీ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వివాహాలు, ఇతర శుభకార్యాలకు నిబంధనలతో కూడిన అనుమతులను ఇచ్చినట్టుగానే వినాయక చవితి వేడుకలకు వర్తింపజేస్తూ అనుమతి ఇవ్వాలని ఈ విషయంలో మీరు పునరాలోచించాలని ఆశిస్తున్నట్టు కోరారు.