నాపై దాడి జరగబోతుంది.. ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు..!

Saturday, September 26th, 2020, 11:00:41 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన కార్యాలయంపై దాడికి కార్యాచరణ రూపొందిందని, మరో రెండు, మూడు రోజుల్లో దాడి జరగనుందని చెప్పుకొచ్చారు. వాళ్లు దాడి చేస్తే నేను ఆవేశంలో ఏదో ఒక మాట అనే అవకాశం ఉందన్న ఆలోచనల్లో వారు ఉన్నారని అన్నారు. తోలు తీస్తా అన్నారని, ఊళ్లోకి రా పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టిస్తా అని ఒక ఎంపీ అన్న వ్యాఖ్యలను తాను ప్రస్తావిస్తే దానిని వాళ్ల జాతిని అన్నట్టు చిత్రీకరించారని అన్నారు.

అయితే తాను అన్న మాటలకు రుజువులు ఉన్నాయని, తన వెనక జరుగుతున్న కుట్ర తెలియాలనే అందరికి చెబుతున్నట్టు తెలిపాడు. తనపై దాడి వార్తలు సాక్షి ఛానెల్, పేపర్‌లలో వస్తాయని అన్నాడు. అయితే తనకు మద్ధతుగా దళిత సంఘాలు ఉన్నాయని, దళిత హిందూ నాయకులు తనతో మాట్లాడారని, వారి హక్కుల కోసం పోరాడటంతోనే వారంతా తనకు మద్దతుగా ఉన్నారని అన్నారు. హిందువుల ముసుగులో దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లు కొట్టేస్తున్నారని ఈ విషయాన్ని ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళానని అందుకే దళిత హిందువులు తనకు మద్ధతుగా ఉన్నారని అన్నారు.