షర్మిల కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణం రాజు..!

Tuesday, February 9th, 2021, 03:23:42 PM IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. నేడు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ అభిమానులతో భేటీ అయి పార్టీ ఏర్పాటుపై చర్చించిన షర్మిల త్వరలోనే పార్టీనీ ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే షర్మిల కొత్త పార్టీ పెడుతుండడంపై స్పందించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకమని, సమైక్య ఏపీకి అనుకూలమని ఈ విషయం తెలంగాణలో అందరికీ తెలుసని అన్నారు. షర్మిల పార్టీ పెట్టడం జగన్ డైరెక్షన్‌లో జరిగిందా లేదా అనేది త్వరలోనే తేలుతుందని అన్నారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఓట్లు రావడం కష్టమని, తమిళనాడు లేదా కర్నాటకలో పార్టీ పెడితే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని రఘురామ సూచించారు. వైఎస్ జగన్ జైళ్లో ఉన్నప్పుడు వైసీపీ కోసం షర్మిల చాలా కష్టపడిందని అన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని నిజంగా ఇద్దరి మధ్యా వైరం ఉంటే ఏపీలో పార్టీ పెట్టకుండా తెలంగాణలో ఎందుకు పెడతారని అన్నారు. బ్రదర్ అనిల్ విల్లు అయితే షర్మిల బాణం అని రఘురామ అభిప్రాయపడ్డారు.