సీఎం జగన్‌కి పెద్దగా తెలుగు రాదు.. ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్స్..!

Monday, August 31st, 2020, 07:15:55 PM IST

Raghurama-Jagan

ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నేడు ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం జగన్‌కి పెద్దగా తెలుగు రాదని అన్నాడు. కరోనాతో సహజీవనం తప్పదు అని ఆయన మాట్లాడిన ఉద్దేశం “ఇది ఇప్పటికిప్పుడు పోయేది కాదన్న” అర్ధమని అన్నారు. అయితే అందరూ కరోనాను సీరియస్‌గా తీసుకొని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అయితే ఏపీలో ఓ పక్క కరోనా కేసులు పెరిగిపోతుంటే దీనిపై ప్రభుత్వం సమీక్షలు జరపకుండా తెల్లారి లేస్తే కోర్టులు, విశాఖ వెళ్లిపోవాలన్న తొందరపాటు, కక్ష్య సాధింపు వంటివి మాత్రమే కనిపిస్తున్నాయని రఘురామ ఎద్దేవా చేశారు. రాజధాని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని దానిపై కాకుండా కరోనాపై దృష్టి సారించాలని కోరారు. ఏపీకి మూడు రాజధానులు అనేది ఓ భ్రమేనని వైసీపీ నేతలు గుర్తించుకోవాలని వ్యాఖ్యానించారు. ఇకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 25 వేల కోట్ల వరకు బకాయి పడిందని అన్నారు. బంధుప్రీతి కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు ఇచ్చారని ఇంతవరకు ఉపాధి హామీ పనుల డబ్బులు కూడా ఇవ్వలేదని అన్నారు.