రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు.. జగన్ సర్కార్‌కు రఘురామ సజేషన్..!

Thursday, September 3rd, 2020, 07:07:37 PM IST

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే దీనిపై స్పందించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడం ప్రజా విజయమని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మాతృభాషలోనే విద్యాభ్యాసం చేస్తారని చెప్పుకొచ్చారు.

అయితే అధికారంలో ఉన్నామని రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడితే కోర్టులు జోక్యం చేసుకుంటాయని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఇప్పటికైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లొద్దని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే కరోనా కట్టడిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని అన్నారు. నూతన ఆరోగ్య బీమా పాలసీతో ప్రభుత్వం ముందుకురావాలని అన్నారు. అయితే ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అని అన్నారు.