సీఎం జగన్ ప్రధాని మోదీనీ కలవాలి.. ఎంపీ రఘురామ సూచన..!

Friday, February 19th, 2021, 12:41:14 AM IST


ఏపీ సీఎం జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఓ సూచన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో సీఎం జగన్ తన నిస్సహాయతను వ్యక్తం చేశారని, అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేయాలని అన్నారు. అయితే కేవలం లేఖలతో సరిపెట్టుకోకుండా సీఎం జగన్ అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి ప్రధాన మంత్రిని కలవాలని సూచించారు.

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో పునరుద్దరణ చేసే విధంగా సీఎం జగన్ చర్యలు ఉండాలన్నారు. విశాఖ ప్రజలలో ఆదరణ తగ్గిందని నిన్నటి ముఖ్యమంత్రి పర్యటనలో రుజువయిందని అన్నారు. విశాఖలో రాజధాని వద్దన్న భావన నగర ప్రజలలో కనబడుతుందని, విశాఖ రాజధాని వద్దు.. అమరావతి ముద్దు అనే నినాదంతో రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని ఎంపీ రఘురామ పిలుపు ఇచ్చారు.