జగన్ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డ ఎంపీ రఘురామ కృష్ణంరాజు..!

Saturday, August 8th, 2020, 07:31:49 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్ సర్కార్‌పై మరో సారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయని సోషల్ మీడియాలో గొప్పలు చెబుతున్నారని నిజంగానే వాలంటీర్లే అంతా బాగా పని చేస్తే కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయని అన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఫ్రాంక్లిన్‌ ఎందుకు కితాబు ఇచ్చారో అర్థం కావట్లేదన్నారు.

పక్క రాష్ట్రాలలో కరోనాను బాగా కంట్రోల్ చేస్తున్నారని, ఏపీలో మాత్రం పరిస్థితి అద్వానంగా మారిందన్నారు. ఇక ఏపీలో మద్యం పేరుతో దందా జరుగుతుందని, ఊరు, పేరు లేని బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, మద్యం కొనలేక చాలా మంది శానిటైజర్లు తాగి చచ్చిపోతున్నారని అన్నారు. మద్యాన్ని పాత రేట్లకే అమ్మాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం సాధించేది ఏమి ఉండదని, సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెబుతూనే మూడు రాజధానుల నిర్మాణం చేపట్టి తీరుతామని అంటున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం డబ్బు వృధా చేయడం తగదని, ప్రజా ఆమోదం లేని నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.