రాజీనామా చేస్తే మూడు రెట్లు ఎక్కువ మెజారీటీతో గెలుస్తా – రఘురామకృష్ణంరాజు

Wednesday, August 26th, 2020, 06:10:32 PM IST

Raghuramakrishnam

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులకు ఎవరూ భయపడకండని ఏపీ ప్రజలకు ఆయన హితవు పలికారు. నాకూ బెదిరింపులు వస్తున్నాయి ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదని అన్నారు. పీపీఈ కిట్లు లేవని ఎప్పుడో కామెంట్ చేస్తే డాక్టర్ గంగాధర్ వంటి ప్రముఖ వైద్యులకు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు.

అయితే ప్రభుత్వం తప్పులు చేస్తుంది సరిదిద్దుకోండని చెబితే నన్ను రాజీనామా చేయమని అంటున్నారని రాజీనామా చేస్తే ఏమవుతుంది, మూడు రెట్లు ఎక్కువ మెజార్టీతో గెలుస్తా అని అన్నారు. అయినా పెయిడ్ ఆర్టిస్టుల మాటలు తాను పట్టించుకోనని అన్నారు. అయితే సీఎం జగన్ ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవాలని అన్నారు. నేను నిజాలు మాట్లాడితే కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ దుర్మార్గాలను, లోపాలను ఎత్తిచూపితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఇలాంటి పద్ధతులు మంచిది కాదని మీ ఆటలు ఎక్కువ కాలం సాగవని అన్నారు. ఇకపోతే జగన్‌ ప్రభుత్వాన్ని ఏపీ‌లో 50 శాతానికి పైగా ప్రజలు కోరుకోలేదని గుర్తించుకోవాలని అన్నారు. డాక్టర్‌ రమేష్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎక్కువ మక్కువ చూపుతున్నారని అదే జరిగితే డా.రమేష్‌కు కాదు వైద్య వృత్తికి అవమానం చేసినట్టు అని అభిప్రాయపడ్డారు. పవిత్రమైన వృత్తిలో ఉన్నవారిపై కులం పేరుతో కక్ష కట్టడం దుర్మార్గమని ఇప్పటికైనా ఈ విషయంపై జగన్ ఆలోచించాలని అన్నారు.