పాదయాత్ర వేడుకలకు అడ్డురాని కరోనా ఎన్నికలకు అడ్డొస్తుందా – రఘురామకృష్ణంరాజు

Wednesday, November 18th, 2020, 07:32:12 PM IST

ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడ్డ స్థానిక ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వైసీపీ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే ఈ వివాదంపై మాట్లాడిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి, ఎన్నికల నిర్వహణకు ఎందుకని అన్నారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్‌ లేఖ రాయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.

అయితే 151 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటి నుంచి ఏం చేసినా చెల్లుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారని అన్నారు. అన్ని సీట్లు గెలిచి కూడా ఎన్నికలు అంటే వైసీపీ ఎందుకు భయపడుతుందని అన్నారు. ఈ విషయంలో గవర్నర్ ప్రేక్షక పాత్ర వహిస్తే కనుక కోర్టులు జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించమని ఆదేశించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అధికారులు, పోలీస్ సిబ్బంది ముందుకు రాకుండా కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు.