‘కిసాన్ బచావో’ నినాదాన్ని తీసుకురండి!

Tuesday, December 23rd, 2014, 09:46:43 AM IST


తెలంగాణ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం లోక్ సభలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టంలో సవరణ తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘బేటీ పడావో-బేటీ బచావో’ వంటి చక్కని పధకాలు రూపొందిస్తున్న కేంద్రప్రభుత్వం ‘కిసాన్ బచావో’ నినాదాన్ని కూడా తీసుకురావాలని సూచించారు. అలాగే వ్యవసాయ రంగం సంక్షేమం కోసం ప్రత్యేక బ్యాంకులు నెలకొల్పాలని కవిత కేంద్రాన్ని కోరారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ చైనా వంటి వ్యవసాయ ఆధారిత దేశాలు రైతుల కోసం, వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేసాయని, మనదేశంలో కూడా అలాంటివి నెలకొల్పాలని సూచించారు. అలాగే కేంద్రం తెచ్చిన బిల్లు 1975 నాటి మూలచట్టం స్పూర్తిని దెబ్బతీసేలా, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు హరించేలా ఉందని కవిత అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణలో దక్కన్ గ్రామీణ బ్యాంకు ఇతర అనుబంధ వృత్తుల వారికి రుణాలు ఇవ్వడం లేదని కవిత పేర్కొన్నారు.