అవగాహనతో మాట్లాడు.. షర్మిలకు ఎంపీ అరవింద్ అల్టీమేట్ కౌంటర్..!

Saturday, March 27th, 2021, 01:52:16 AM IST


తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల నేడు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానుల‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు ప‌సుపు బోర్డు తెస్తాన‌ని ఎవ‌రో బాండ్ పేప‌రో ఇచ్చారంట‌ అని బాండ్ పేప‌ర్ ఇచ్చి రైతుల‌ను ద‌గా చేశారట అంటూ బీజేపీ ఎంపీ అరవింద్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఉండ‌టం తెలియ‌దా అని ప్రశ్నించారు.

అయితే షర్మిల వ్యాఖ్యల్పై స్పందించిన ఎంపీ అరవింద్ మన తెలంగాణ కోడలు, బ్రదర్ అనిల్‌గారి భార్య సిస్టర్ షర్మిల నన్ను ఎక్కడో గుర్తు చేసుకున్నారాట.. సంతోషం అంటూ.. ఏదైనా మాట్లాడే ముందే అవగాహనతో మాట్లాడాలని సూచించారు. మీ తండ్రి వైఎస్సార్ భాగస్వామిగా ఉన్న యూపీఏ, యూపీఏ2 సర్కార్‌ హయాంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని ప్రస్తుతం పసుపుకు అత్యధిక ధర కల్పిస్తున్నామని, మీ అన్న సీఎంగా ఉన్న ఏపీలో ప్రకటించిన బోనస్ ధరకంటే ఇక్కడ ఎక్కువ ధర ఇస్తున్నామని అన్నారు. వైఎస్‌ఆర్‌ కూతురు అయినంత మాత్రాన వైఎస్‌ఆర్‌ కాలేరని, తెలంగాణ యాస కోసం‌ షర్మిల చాలా తిప్పలు పడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది రాజన్న రాజ్యం కాదని, రామరాజ్యం అని చెప్పుకొచ్చారు.