గ్రేటర్ రిజల్ట్స్: తల్లి ఓటమికి కొడుకు కారణమయ్యాడు..!

Saturday, December 5th, 2020, 01:18:53 PM IST

గ్రేటర్ ఎన్నికలలో అనూహ్యంగా తల్లి ఓటమికి కొడుకు కారణమయ్యాడు. అదేలా అనుకుంటున్నారు కదూ.. హయత్‌నగర్‌ సర్కిల్‌లోని బీఎన్‌రెడ్డి నగర్ నుంచి ముద్దగౌని లక్ష్మీప్రసన్నగౌడ్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఉదయం నుంచి లక్ష్మీప్రసన్నగౌడ్‌ బీజేపీ అభ్యర్థిపై 1206 ఓట్ల లీడింగ్‌లో కొనసాగారు. అయితే సాయంత్రంలోపు లెక్కలన్ని పూర్తిగా తారుమారైపోయాయి.

బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్నగౌడ్‌ 32 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. అయితే డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్షీప్రసన్నగౌడ్‌ కుమారుడు రంజిత్‌గౌడ్ తల్లి ఓటమికి కారణమయ్యాడు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంజిత్‌ గౌడ్‌ నామినేషన్ విత్‌డ్రా చేసుకోకపోవడంతో బ్యాలెట్‌ పత్రంలో ఆయన పేరు కూడా వచ్చింది. అయితే రంజిత్‌ గౌడ్‌కు 39 ఓట్లు పోలయ్యాయి. ఒకవేళ ఆయన ముందే విత్‌డ్రా చేసుకుని ఉంటే ఆ 39 ఓట్లు కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్షీప్రసన్నగౌడ్‌కే పోలయ్యేవి. దీంతో ఆమె విజయం సాధించి ఉండేదని పలువురు భావిస్తున్నారు.