కొత్త జంటకు ఆశీస్సులు అందించిన వానరం.. వీడియో వైరల్..!

Saturday, September 12th, 2020, 10:11:57 PM IST


ప్రస్తుతం కరోనా కారణంగా బంధు మిత్రులు, భాజాభజంత్రిలతో అంగరంగవైభవంగా జరిగే పెళ్ళిళ్లు సాదా సీదాగా జరుగుతున్నాయి. పెళ్ళిళ్లకు పరిమిత సంఖ్యలో బంధువులను పిలుచుకుంటుండడంతో నూతన వధువరులకు చాలా మంది ఆశీస్సులు తగ్గిపోతున్నాయి. అయితే బంధువులు లేక బోసిపోయిందనుకుందో లేక ఆశీస్సులు కరువయ్యాయి అనుకుందో ఓ పెళ్ళికి వానరం అతిధిగా వచ్చి వధూవరులను మనసారా ఆశీర్వదించింది.

ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వాజేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామానికి చెందిన బోదెబోయిన భరత్ కుమార్, నాగమణిల వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలో ఒక వానరం వచ్చి హల్ చల్ చేసింది. అతిధులతో కాసేపు కూర్చుని అక్షింతలు పడే సమయంలో వధూవరుల తలపై ఎక్కి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.