త్వరలో పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్ళు..!

Tuesday, September 29th, 2020, 08:32:13 AM IST

దశల వారిగా లాక్‌డౌన్ సడలింపులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు అన్ని రవాణాలను ప్రారంభిస్తున్నాయి. అయితే తెలంగాణలో తొలుత జిల్లా బస్సు సర్వీసులు ప్రారంభించగా, సెప్టెంబర్‌ 7 నుంచి నగరంలో మెట్రో రైళ్ళు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక ఇటీవలే సిటీ బస్సులను కూడా ప్రారంభించిన ప్రభుత్వం ఎంఎంటీఎస్ రైళ్ళును నడిపేందుకు సిద్దమవుతుంది.

అయితే అన్ని అనుకూలిస్తే మరో 15 నుంచి 20 రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఆరున్నర నెలల నుంచి షెడ్లకే పరిమితమైన రైళ్లకు మరమ్మతు, పరిశుభ్రత పనులు చేయిస్తున్నట్లు సమాచారం. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ, పరిమిత సంఖ్యలో ప్రయాణికులకు అనుమతులు ఇచ్చి వీటిని కూడా అందుబాటులోకి తేనున్నారు. అతి తక్కువ ధర, తక్కువ సమయంలో జంట నగరాల్లోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించే లోకల్‌ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.