బిగ్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Tuesday, February 16th, 2021, 12:30:16 PM IST

తెలంగాణ రాష్ట్రం లోని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ నేటి నుండి ప్రారంభం అయింది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ మరియు మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి కాలపరిమితి ఈ ఏడాది మార్చి 29 వ తేదీ తో ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానాల భర్తీ కొరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ఇవాళ్టి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ లను స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకూ కూడా ఈ స్థానాలకి నామినేషన్ లని దాఖలు చేసే అవకాశం ఉన్నది. అయితే 24 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, 26 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ కి గడువు ఇచ్చారు.

అయితే మార్చి 14 వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17 వ తేదీన ఓట్ల లెక్కింపు తో పాటుగా ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. అయితే మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం కి ఎన్నికల అధికారి గా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎడిషనల్ కమిషనర్ మరియు నల్గొండ – ఖమ్మం – వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం కి ఎన్నికల అధికారి గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ లను జారీ చేశారు. అయితే ఈ ఎన్నికల పట్ల అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష పార్టీ నేతలు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నాయి.