ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్‌డేట్: రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులదే పైచేయి..!

Saturday, March 20th, 2021, 08:30:47 AM IST

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజులుగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. అయితే మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇవాళ రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తే ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,17,386 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరాంకు 79,110 ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం పల్లా రాజేశ్వర రెడ్డి 25,528 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ అభ్యర్ది విజయం సాధించాలంటే 1,68,520 ఓట్లు అవసరం ఉంది.

ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తే ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,15,043 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 1,06,565 ఓట్లు రాగా, ప్రొఫెసర్ నాగేశ్వర్ 55,742 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నా రెడ్డికి 32,879 ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 8,478 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ అభ్యర్థి విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు అవసరం ఉంది.